ప్రస్తుత తరుణంలో ఆత్మహత్యలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లవ్‌లో ఫెయిల్ అయ్యామనో.. చాలా మంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇలాగే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బడంగ్‌పేట చంద్రవిహార్‌కాలనీకి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి కుమార్తె ప్రశాంతి (18) డిగ్రీ రెండో సంవత్సరం విద్యను అభ్యసిస్తోంది. అయితే ప్రశాంతి తరచూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో ఆ విషయాన్ని ఆమె తండ్రి గమనించాడు.
అయితే ఫోన్‌లో తరచూ మాట్లాడొద్దని, ఎక్కువగా ఉపయోగించొద్దని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.