న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ESIC హెడ్ క్వార్టర్స్ వారు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ డిస్పెన్సరీలు లేదా హాస్పిటల్స్‌లో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022/2023లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు గాను దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా జనవరి 31వ తేదీ వరకు గడువు విధించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. మరిన్ని వివరాలకు గాను https://www.esic.in/IMOG2/Login.aspx అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు. ఈ వెబ్‌సైట్ లో పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. మొత్తం 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేస్తారు. యూఆర్ కేటగిరిలో 254 ఖాళీలు ఉండగా, ఎస్సీ విభాగంలో 63, ఎస్‌టీ 53, ఓబీసీ 178, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎంబీబీఎస్ డిగ్రీ అర్హతతోపాటు రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తయి ఉండాలి. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022/23 డిస్‌క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం ఇస్తారు. వయస్సు 2022 ఏప్రిల్ 26 నాటికి 35 ఏళ్లు మించకూడదు. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తోపాటు రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.