Akira Nandan : ఒకప్పుడు ఇంటర్నెట్ ఉంటే గొప్ప. తరువాత మనకు కావల్సిన సమాచారాన్ని వెదికిపెట్టే సెర్చ్ ఇంజిన్ వెబ్సైట్లు వచ్చేశాయి. అయితే ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీలో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఏది కావాలన్నా కూడా సెర్చ్ ఇంజిన్ సైట్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. ఏఐ సహాయంతో పూర్తి చేయవచ్చు. అవును, ఇప్పుడు ఏఐ అన్ని రంగాలలోనూ విప్లవాన్ని సృష్టిస్తోంది. అనేక మార్పులకు కారణం అవుతోంది. అయితే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ఎంత లాభం ఉందో, అంతే నష్టం కూడా ఉందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏఐ గురించి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏఐని గనక కంట్రోల్ చేయకపోతే అది భవిష్యత్తులో మానవాళిపై పెను ప్రభావం చూపిస్తుందని అన్నారు. అయితే అప్పటి వరకు ఏమోగానీ ఏఐ దెబ్బకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వారు మాత్రం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సినీ హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలను కొందరు కేటుగాళ్లు ఇప్పుడు క్రియేట్ చేసి హల్ చల్ చేస్తున్నారు. ఇటీవలే రష్మిక మందన్నతోపాటు బాలీవుడ్ నటి కాజోల్ కు చెందిన డీప్ ఫేక్ వీడియోలను కొందరు క్రియేట్ చేసి నెట్లో వదిలారు.

అకీరా నందన్ ఫేక్ వీడియో వైరల్..
దీంతో ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. సదరు నటీమణులు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ వీడియోలు ఫేక్ అని, వాటిల్లో ఉంది తాము కాదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అచ్చంగా నిజమైన వ్యక్తులను పోలి ఉంటుండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ల వీడియోలను నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఏఐ ప్రభావం వల్ల జరుగుతుందే. అయితే ఇప్పుడు ఏఐ వల్ల బాధించబడ్డ వారి జాబితాలో నటుడు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా చేరిపోయాడు.
కొందరు కేటుగాళ్లు అకీరా నందన్‌కు చెందిన డీప్ ఫేక్ వీడియోను నెట్లో వైరల్ చేస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి వీడియోలను ఎవరూ నమ్మవద్దని కోరుతున్నారు. ఏఐ వల్ల సినిమా రంగానికి చెందిన వాళ్లకు మాత్రం తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.