Pickles : ఆహారం విషయంలో, చాలామంది జాగ్రత్త తీసుకోరు. నచ్చిన ఆహారాన్ని, రుచిగా ఉండే ఆహారాన్ని తినేస్తూ ఉంటారు. కొంతమందికి ఎక్కువగా పచ్చళ్ళు ఇష్టం. ఇంట్లో కూరలు లేకపోయినా, పచ్చళ్ళతో కాలం గడిపేస్తూ ఉంటారు. కానీ, నిజానికి వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకుని తింటే, దానికి మించిన రుచి ఇంకేమీ ఉండదు. ఆవకాయ, గోంగూర, నిమ్మకాయ, ఉసిరికాయ ఇలా చాలా రకాల పచ్చళ్ళని మనం పెట్టుకుని, తింటూ ఉంటాము. అలానే నాన్ వెజ్ లో కూడా పలు పచ్చళ్ళు ఉన్నాయి.
అయితే, ఊరగాయలు పెట్టేటప్పుడు పాడైపోకుండా ఉండడానికి, ఎండలో ఎండబెట్టి నూనె, ఉప్పు వేసి పచ్చళ్ళని పెడుతూ ఉంటారు. ఉప్పులో వేసి, ఎండబెట్టడం వలన పోషకాలు పోతాయి. ఊరగాయ తయారు చేసే ప్రక్రియ పోషక విలువలను తగ్గించేస్తుంది. ఎక్కువ ఊరగాయలని తినడం వలన, ఆరోగ్యానికి ప్రయోజనం ఏమి ఉండదు. ఎలాంటి పోషకాలు అందవు. ఉప్పు ఎక్కువ ఉండడం వలన హైపర్ టెన్షన్ వచ్చే ముప్పు కలుగుతుంది.
హైపర్ టెన్షన్ తో ఇప్పటికే బాధపడుతున్న వాళ్ళు, ఊరగాయలని తీసుకుంటే లక్షణాలు ఇంకా తీవ్రంగా మారతాయి. ఇలా, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం ఎక్కువవుతుంది. ఎప్పుడో ఒకసారి ఊరగాయలని తీసుకోవచ్చు. ఎలాంటి హాని కలగదు. ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.
ఊరగాయలు ఎక్కువ తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం, అధిక రక్తపోటు, కిడ్నీల పై పని భారం పెరగడం వంటి సమస్యలు కలుగుతాయి. ఇందులో ఉండే నూనె కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది. గుండె సమస్యల ముప్పు ని కూడా పెంచుతుంది. నూనె ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. అలానే హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కాలేయాన్ని కొంత కాలానికి దెబ్బతీస్తాయి.