అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే ఆ వ్యక్తి మాత్రం బీర్ డైట్‌ను పాటించాడు. అవును. మీరు విన్నది నిజమే. అమెరికాకు చెందిన డాన్ హాల్ అనే వ్యక్తి ఫిబ్రవరి నుంచి బీర్ డైట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను భారీగా బరువు తగ్గాడు.
డాన్ హాల్ ఫిబ్రవరి నుంచి 45 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే చేశాడు. ఘనాహారాన్ని పూర్తిగా మానేశాడు. ద్రవాహారంలో భాగంగా అతను రోజూ బీర్, టీ, కాఫీ, నీళ్లు వంటివి తీసుకున్నాడు. అలాగే వ్యాయామం కూడా చేశాడు. దీంతో అతను 45 రోజుల అనంతరం ఏకంగా 18 కిలోల బరువు తగ్గాడు. అతను బరువు తగ్గక ముందు, తగ్గిన తరువాత తీసుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.
అయితే ఈ తరహా డైట్ కొత్తదేమీ కాదు. 1600వ సంవత్సరంలో కాథలిక్ సన్యాసులు కొందరు ఈ డైట్‌ను కనిపెట్టారు. అప్పటి నుంచి ఈ డైట్ పాపులర్ అయింది. కొందరు దీన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇక 2019లోనూ డాన్ హాల్ ఇలాగే 46 రోజుల పాటు ఈ డైట్‌ను పాటించి అప్పట్లో 20 కిలోల వరకు తగ్గాడు. సాధారణంగా ఈ డైట్ ను ఎవరైనా చేయవచ్చని, అయితే ఫలితాలు మాత్రం అందరికీ ఒకేలా రావని అతను తెలిపాడు.