ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆ యాప్ లో వినియోగదారులు చిన్న మొత్తాల్లో రుణాలను తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పేటీఎం.. పోస్ట్ పెయిడ్ మినీ పేరిట ఓ సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా రూ.250 నుంచి రూ.1000 వరకు చిన్న మొత్తాల్లో రుణాలను అందిస్తారు.
ఈ సేవకు గాను పేటీఎం సంస్థ ఆదిత్య బిర్లా సంస్థతో భాగస్వామ్యం అయింది. వినియోగదారులు తమ పేటీఎం యాప్‌లో ఈ సేవను పొందవచ్చు. దీని ద్వారా తీసుకున్న రుణంతో మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చు. బిల్లు చెల్లింపులు చేయవచ్చు. డీటీహెచ్ రీచార్జిలు, గ్యాస్ బుకింగ్, విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.
ఇప్పటికే పేటీఎంలో పోస్ట్ పెయిడ్ పేరిట సర్వీస్ అందుబాటులో ఉంది. కానీ ఈ మినీ సర్వీస్‌తో తక్కువ మొత్తంలో రుణాలను అందిస్తారు. ఇక ఈ రుణానికి ఎలాంటి వడ్డీ ఉండదు. వినియోగదారులు రుణం పొందిన తరువాత 30 రోజుల్లోగా చెల్లించాలి. ఇక స్వల్ప మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేస్తారు. యాక్టివేషన్ చార్జిలు కూడా లేవు.