దేశంలోని తమ కస్టమర్లకు త్వరలోనే 5జి సేవలను అందిస్తామని ఇప్పటికే టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రకటించిన విషయం విదితమే. జియోతోపాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు కూడా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తూనే 5జి ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో 5జి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా ? అని వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే 5జి ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కాగా ఇప్పటికే మార్కెట్‌లో పలు కంపెనీలు 5జి స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. అయితే అన్నింటికన్నా ముందు, తక్కువ ధరకే 5జి ఫోన్‌ను అందిస్తామని రియల్‌మి ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి వరకు అత్యంత తక్కువ ధరకే 5జి ఫోన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఆ ఫోన్ ధర రూ.7వేలు ఉంటుందని, మొదటి సేల్‌లో 60 లక్షల యూనిట్లను అందుబాటులో ఉంచుతామని అన్నారు.
అత్యంత తక్కువ ధరకు ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా 5జి ఫోన్‌ను విడుదల చేయలేదు. దీంతో రియల్‌మి కంపెనీ ఆ విభాగంలో ముందుండాలని చూస్తోంది. అందుకనే అన్ని కంపెనీల కన్నా ముందు తామే బడ్జెట్ 5జి ఫోన్‌ను లాంచ్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీల మధ్య 5జి ఫోన్ల కోసం పోటీ నెలకొందని చెప్పవచ్చు.