స్మార్ట్ ఫోన్ కొనడం అనేది ప్రస్తుతం సర్వ సాధారణం అయిపోయింది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లను కంపెనీలు విక్రయిస్తున్నాయి. అయితే ఫోన్లను కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఫోన్‌ను ఎందుకు కొంటున్నాము, అందులో ఏమేం ఫీచర్లు ఉండాలి ? అనే వివరాలను ఒకసారి తెలుసుకోవాలి. దీంతో కొన్న ఫోన్ మనకు సరిగ్గా ఉపయోగపడుతుంది. మరి ఫోన్ కొనే ముందు ఏయే విషయాలను పరిశీలించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. స్మార్ట్ ఫోన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది డిస్‌ప్లే. డిస్‌ప్లే బాగా ఉంటేనే పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. అందువల్ల కనీసం ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ (1080 x 1920) ఉండే ఫోన్‌ను కొంటే అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఇక డిస్‌ప్లేకు సాధారణంగా 60 హెడ్జ్ రిఫ్రెష్ ఇస్తారు. కానీ కొన్ని ఫోన్లకు 90, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ వస్తోంది. అధిక రిఫ్రెష్ రేట్ ఉంటే పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. కనుక 90, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే ఫోన్లను కొనడం ఉత్తమం. అలాగే ఫోన్ డిస్‌ప్లేలు ఐపీఎస్ ఎల్‌సీడీ, అమోలెడ్, సూపర్ అమోలెడ్, ఎల్ఈడీ, ఓలెడ్ తరహాలో ఉంటున్నాయి. వీటిల్లో సూపర్ అమోలెడ్, ఓలెడ్ డిస్‌ప్లేలు ఉన్న ఫోన్లు బాగుంటాయి. కనుక వాటిని ఎంపిక చేసుకోవాలి. అలాగే డిస్‌ప్లేలకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండేలా చూసుకుంటే ఫోన్ కింద పడ్డా పగలదు. సురక్షితంగా ఉంటుంది. దీంతోపాటు ఫోన్ డిస్‌ప్లే సైజ్ 5.5 ఇంచుల ఆపైన సైజ్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల పెద్ద సైజు డిస్‌ప్లేలో దృశ్యాలను వీక్షించవచ్చు.
2. ఫోన్ వేగంగా పనిచేయడం లేదని కొందరు కంప్లెయింట్ చేస్తుంటారు. కానీ ఫోన్ వేగంగా పనిచేసేందుకు ర్యామ్, ప్రాసెసర్ ఎక్కువ కెపాసిటీ కలిగినవి అయి ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో 6జీబీ, 8జీబీ ర్యామ్‌ను కామన్‌గా అందిస్తున్నారు. కనుక కనీసం ఈ రెండు కెపాసిటీల్లో ర్యామ్ కలిగిన ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఆ ప్రాసెసర్ ఉన్న ఫోన్లనే తీసుకోవాలి.
3. ప్రస్తుతం వస్తున్న ఫోన్లలో చాలా వరకు వాటిలో బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్ ఉంటోంది. కనుక బ్యాటరీ గురించి పెద్దగా దిగులు చెందాల్సిన పనిలేదు. కానీ బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఫోన్‌తోపాటు ఫాస్ట్ చార్జర్‌ను అందిస్తారో, లేదో చూసి మరీ ఫోన్‌ను తీసుకోవాలి. దీంతో ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ సేపు చార్జింగ్ ఉంటుంది. త్వరగా చార్జింగ్ అయిపోదు.
4. ఫోన్లను కొనేటప్పుడు వాటి బిల్డ్ క్వాలిటీని కూడా గమనించాలి. కొన్ని కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లను తయారు చేస్తాయి. కానీ బిల్డ్ క్వాలిటీ చీప్ గా ఉంటుంది. ప్లాస్టిక్‌తో పైన, కింద కవర్లను ఏర్పాటు చేస్తారు. కనుక బిల్డ్ క్వాలిటీని చెక్ చేయాలి. మెటల్, గ్లాస్‌తో తయారు చేసిన ఫోన్లను తీసుకోవాలి. దీంతో అవి త్వరగా పగలవు. సురక్షితంగా ఉంటాయి. అలాగే గీతలు పడకుండా ఉంటాయి. కొన్ని ఫోన్లకు ముందు, వెనుక భాగాల్లో గ్లాస్ లేదా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. దాన్ని గమనించి ఫోన్‌ను కొనడం ఉత్తమం.
5. ప్రస్తుతం ఉన్న చాలా ఫోన్లలో ఆండ్రాయిడ్ 10, 11 ఓఎస్‌లను అందిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు తమ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను అందించవు. కానీ కొన్ని 2, 3 ఏళ్ల వరకు అప్ డేట్స్‌ను అందిస్తాయి. అలాంటి ఫోన్లను పరిశీలించి కొనుగోలు చేయాలి. దీంతో ఫోన్ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ పరంగా సమస్యలు రాకుండా ఉంటాయి.
6. ప్రస్తుతం వస్తున్న చాలా ఫోన్లలో హై కెపాసిటీ ఉన్న కెమెరాలను అందిస్తున్నారు. మీరు నిజంగా సెల్ఫీలు లేదా ఫొటోల లవర్ అయితే కెమెరా ఎక్కువగా ఉన్న ఫోన్లను కొనుగోలు చేయాలి. కెమెరాతో పనిలేదు, సాధారణ కెమెరా ఉన్నా చాలు అనుకుంటే.. కెమెరా ఫీచర్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. సాధారణ కెమెరాలు ఉండే ఫోన్లను కూడా కొనుగోలు చేయవచ్చు.
7. ఫోన్ల కలర్ కూడా కొందరిని ఆలోచింపజేస్తుంది. చాలా మంది బ్లాక్, సిల్వర్, వైట్ కలర్‌లలో ఉండే ఫోన్లను కొంటారు. ఇవి కామన్ కలర్స్. కనుక ఈ కలర్స్‌లో ఉండే ఫోన్లు అయితే బెటర్.