సాధారణంగా మనకు ఆకాశంలో ఇంద్రధనస్సు విల్లు ఆకారంలో కనిపిస్తూ సందడి చేస్తుంది. కానీ ఇంద్రధనస్సు ఎప్పుడైనా సూర్యుని చుట్టూ వలయాకారంలో ఏర్పడటం మీరు చూశారా? ఈ విధమైనటువంటి అద్భుతమైన అవకాశం బెంగళూరు ప్రజలకు దక్కింది. మే 24వ తేదీన ఆకాశంలో అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది.
సుమారు పదకొండు గంటల సమయంలో సూర్యుని చుట్టూ వలయాకారంలో ఇంద్రధనస్సులోని రంగులు కనిపించాయి.దీంతో అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తి కరంగా ఈ ఘటన చూడటమే కాకుండా ఈ అద్భుతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి నటువంటి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యూకేకు చెందిన అట్మోస్ఫెరిక్ ఆప్టిక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాశంలో ఉండే పలుచని మేఘాలలో మంచి స్పటికాలు ఉంటాయి. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు ఈ స్పటికాలు పై పడినప్పుడు సూర్యకిరణాల నుంచి వచ్చే కాంతి వల్ల ఈ విధమైనటువంటి రంగుల వలయం ఏర్పడుతుందని తెలిపారు.అయితే ఇది వర్షం రావడానికి ముందుగా లేదా వర్షం పడిన తర్వాత ఈ విధంగా ఆకాశంలో రంగుల హరివిల్లు ఏర్పడుతుంటాయని తెలిపారు.ఈ క్రమంలోనే బెంగుళూరులో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం వలయాకారపు ఇంద్రధనస్సుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.