Anchor Suma : ప్రముఖ యాంకర్ సుమ.. ఎక్కడ ఉన్నా కూడా అక్కడ సందడి ఓ రేంజ్లో ఉంటుంది. వేదిక ఏదైనా సరే సుమ ఉందంటే అక్కడ నవ్వుల సునామీ వస్తుంది. గత 15 ఏండ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా.. స్టేజ్‌పై హడావుడి అంతా సుమదే. సుమ రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కోసం కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీవీలో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం కనీసం లక్ష రూపాయలకు పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక బుల్లితెరపై రాణిస్తున్న సుమ సినిమాల్లో నటించి చాలా కాలమే అయింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా జయమ్మ పంచాయతీ పేరుతో వెండితెరపై మళ్లీ కనిపించనుంది. సుమ ప్రధాన పాత్రలో వస్తున్న జయమ్మ పంచాయతీ చిత్రాన్ని కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కిస్తున్నాడు. మే 6న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో.. సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైంది. ఈ క్రమంలో సుమక్క అంటూ టైటిల్ సాంగ్ వేశారు. ఇక ఆలీతో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు పంచుకుంది సుమ. ఈ క్రమంలోనే తన భర్తతో రాజీవ్ కనకాలతో జరిగిన గొడవలపై స్పందించింది.
రాజీవ్, సుమ విడిపోయారంటూ గతంలో వార్తలు వచ్చాయి. దానిపై స్పందన ఏంటని అడగగా, తనకు, రాజీవ్ కు మధ్య ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నో సార్లు గొడవలు జరిగాయని చెప్పింది. అయితే.. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులువని.. తల్లిదండ్రులుగా విడాకులు తీసుకోవడం మాత్రం చాలా కష్టమని తెలిపింది. ఈ విషయాన్ని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఇక తనకు సినిమాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని.. అయితే, ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఆగానని తెలిపింది. చివరకు జయమ్మ పంచాయతీ సినిమా వచ్చిందని చెప్పింది. తన పూర్తిపేరు పల్లెశెన పాచిమిట్టిన సుమ అని పేర్కొంది. తెలుగు సినిమాల్లో పంచాయితీ పెద్దగా నటించిన ఐదుగురు హీరోల పేర్లు చెప్పమనగానే సుమ తడుముకోకుండా రజనీకాంత్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, సంపూర్ణేశ్‌బాబు అని ఠపీమని చెప్పింది.