బాలీవుడ్ నటి అమృతా రావు సినీ ఇండస్ట్రీలో ఉన్న పురుషాధిక్యతపై కామెంట్లు చేసింది. సినీ రంగంలో నటీమణులు వివక్షను ఎదుర్కొంటారని తెలిపింది. ఆడవాళ్లు కావడం వల్లే వారి సినీ కెరీర్‌పై ప్రభావం పడుతుందని, మగ యాక్టర్ల కెరీర్‌పై పెళ్లి ఎలాంటి ప్రభావం చూపిందని ఆమె పేర్కొంది. మగ యాక్టర్లు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా వారు యంగ్ హీరోయిన్లతో సినిమాల్లో రొమాన్స్ చేస్తారని చెప్పింది.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమృతారావు మాట్లాడుతూ సినీ రంగంలో పురుషులకు ఏమీ కాదని, కానీ స్త్రీలపై పెళ్లి ప్రభావం చూపిస్తుందని, పురుషులు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నా యువ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారని, కానీ స్త్రీలకు కెరీర్ ముగిసిపోతుందని అభిప్రాయపడింది. ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపింది.
1950 నుంచి ఇప్పటి వరకు ఈ విధమైన ట్రెండ్ కొనసాగుతుందని అమృతా రావు తెలియజేసింది. కాగా అమృత చివరిసారిగా థాకరే అనే మూవీలో మీనా అనే పాత్రలో నవాజుద్దీన్ సిద్దికీ తో కలిసి నటించింది. 2019లో ఆ మూవీ విడుదలైంది. బాల్ థాకరే జీవిత చరిత్ర ఆధారంగా ఆ మూవీని తీశారు. అమృత 2016లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అన్మోల్ సూద్‌ను వివాహం చేసుకుంది. అతను ఆర్‌జే అన్మోల్‌గా అందరికీ పరిచయమే. వారికి గతేడాది నవంబర్ లో బాబు జన్మించాడు. అతనికి వీర్ అని నామకరణం చేశారు. తెలుగులో అమృత హీరో మహేష్‌తో కలిసి అతిథి మూవీలో నటించింది.