Anand Devarakonda : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారిలో దేవరకొండ బ్రదర్స్ ఒకరని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ బాటలో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక ఆనంద్.. విజయ్ దేవరకొండ నిర్మాణంలో పుష్పక విమానం చిత్రంలో నటించాడు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా దేవరకొండ బ్రదర్స్ ఇద్దరూ గూగుల్ లో వారి గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఆనంద్ దేవరకొండ మొదటి సారి జాబ్ చేసినప్పుడు అతను నెలకు రూ.40 లక్షల జీతం తీసుకునే వాడని తెలిపారు.
అలాగే తనకు పాములంటే ఎంతో భయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఆనంద్ ప్రస్తుతం సింగిలా ? అనే ప్రశ్న అడగడంతో ఆ ప్రశ్నకు సమాధానం కూడా తెలియదు అంటూ విజయ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తన మొదటి సంపాదన విషయానికి వస్తే ఒక స్కూల్ లో చిన్న పిల్లలకు నాటకంలో శిక్షణ ఇప్పించేందుకు గాను తనకు నెలకు రూ.35 వేల జీతం ఇచ్చేవారని అప్పట్లో అదే చాలా ఎక్కువ అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలియజేశాడు.