అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 22వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపొందింది. బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ కాస్తంత వెనుకబడింది. రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో చివరి ఓవర్లలో పరుగులు పెద్దగా రాబట్టలేకపోయారు. దీంతో ఢిల్లీపై బెంగళూరు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ చేయగా బెంగళూరు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఏబీ డివిలియర్స్, రజత్ పటిదార్‌లు రాణించారు. 42 బంతుల్లో డివిలియర్స్ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 22 బంతుల్లో 2 సిక్సర్లతో రజత్ 31 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, కగిసో రబాడా, అవేష్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్, షిమ్రాన్ హిట్‌మైర్‌లు రాణించారు. 48 బంతుల్లో పంత్ 6 ఫోర్లతో 58 పరుగులు చేయగా, 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో హిట్‌మైర్ 53 పరుగులు చేశాడు. ఇద్దరూ చివరి బంతి వరకు క్రీజులో ఉన్నప్పటికీ చివరి ఓవర్లో చేయాల్సిన పరుగులు ఎక్కువైపోయాయి. దీంతో కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలు కావల్సి వచ్చింది. ఇక బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా, మహమ్మద్ సిరాజ్, కైలీ జేమిసన్‌లు చెరొక వికెట్ తీశారు.