దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రైల్వే మంత్రిత్వ శాఖ రైళ్లలో కోచ్‌లను కోవిడ్ చికిత్స సెంటర్లుగా మారుస్తోంది. అందులో భాగంగానే కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక కోచ్‌లను రైల్వే సిద్ధం చేసింది. మొత్తం 5600 కోచ్‌లకు గాను 3816 కోచ్‌లను రైల్వే ఇప్పటి వరకు కోవిడ్ చికిత్స సెంటర్లగా మార్చింది.
రైల్వే సిద్ధం చేసిన కోవిడ్ చికిత్స కోచ్‌లలో స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఈ కోచ్‌లు బాధితులకు అందుబాటులో ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో పెరిగే కోవిడ్ రోగుల సంఖ్యను బట్టి మరిన్ని కోచ్‌లను సిద్ధం చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
కాగా ఢిల్లీలో 1200 బెడ్లతో 75 కోచ్‌లను సిద్ధం చేయగా, ఉత్తరప్రదేశ్‌లో 50 కోచ్‌లను సిద్ధం చేశారు. ఇక 215 స్టేషన్లలో మరిన్ని కోచ్‌లను సిద్ధం చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే 85 స్టేషన్లలో మాత్రమే రైల్వే తన సొంత సిబ్బందిని వినియోగిస్తామని తెలిపింది. ఈ క్రమంలో మిగిలిన 130 స్టేషన్లలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలే సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే తెలిపింది. అయితే రానున్న రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా పెరగనున్న దృష్ట్యా ఇంకా ఏయే స్టేషన్లలో రైల్వే శాఖ కోవిడ్ చికిత్స కోచ్‌లను ఏర్పాటు చేస్తుందో చూడాలి.