Bandi Sanjay : హుజురాబాద్‌లో తమదే విజయం అని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ ఈ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని అన్నారు. అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ఈ మేరకు సంజయ్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ ఉప ఎన్నికలో తెరాస పార్టీ అత్యంత అప్రజాస్వామికంగా, ఎన్నికల నియమ నిబంధలను ఉల్లంఘించి.. రాజకీయాలు చేసిందని సంజయ్ ఆరోపించారు. డబ్బుతో అడ్డగోలుగా ఓట్లను కొనేందుకు యత్నించారని మండిపడ్డారు. అయితే హుజురాబాద్ ప్రజలు మాత్రం తెరాస కుట్రలను తిప్పికొట్టారని, వారు విజ్ఞతతో వ్యవహరించి తమకే ఓటు వేశారని అన్నారు. ఈటల భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు.
ఈ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇందులో సాధించే విజయం ప్రజలదేనని అన్నారు. తెరాస చేసిన అక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీ గట్టి పోరాటం చేసిందన్నారు. రాష్ట్రంలో త్వరలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు.