Etela Rajender : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉప ఎన్నికల సందర్బంగా రాజకీయం మరింత వేడెక్కింది. అటు ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక, ఇటు తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనున్నాయి. దీంతో అధికార విపక్ష పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
హుజురాబాద్‌లో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన బీజేపీ కనుక, పవన్ జనసేన పార్టీ బీజేపీకి మిత్ర పక్షం కనుక.. పవన్ హుజురాబాద్‌లో ప్రచారం చేస్తారని జోరుగా చర్చ నడుస్తోంది. బీజేపీతో ఆయన ఎప్పటి నుంచో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయితే ఈటలకు మద్దతుగా హుజురాబాద్‌లో ఆయన ప్రచారం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నాయకులు అంటున్నారు.
ఏపీలో జనసేన పార్టీ వైకాపా అంత కాకపోయినా ఓ స్థాయిలో బలంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగానే పోటీ ఇచ్చారు. అయితే తెలంగాణలో మాత్రం జనసేన చురుగ్గా లేదు. సీఎం కేసీఆర్‌ను పవన్ ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. దీనికి కారణాలు ఏమున్నా తెలంగాణ రాజకీయాల్లో పవన్ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. కానీ హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో పవన్ ఈటలకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈటలకు మద్దతుగా ప్రచారం చేయడం వల్ల జనసేనకు బలం పెరుగుతుందని, బీజేపీ శ్రేణులు పవన్ వెంట నడుస్తాయని చెబుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారం అంటే.. ఆషామాషీ కాదు. మద్దతు ఇచ్చేవారికి అనుగుణంగా మాట్లాడాలి. మరోవైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించాలి. కానీ పవన్ ఎప్పుడూ సీఎం కేసీఆర్‌ను, తెరాసను ఏమీ అనలేదు.
Etela Rajender : తెరాసపై అదే విధంగా మాట్లాడుతారా ?
అయితే పవన్ గనక ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తే ఆయన ఏవిధంగా మాట్లాడుతారు ? కేవతం మద్దతు ఇచ్చి ఈటలకు ఓటు వేయమని చెబుతారా ? లేక ఏపీలో వైసీపీపై మాటల యుద్ధం చేసినట్లు ఇక్కడ కూడా తెరాసపై అదే విధంగా మాట్లాడుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇన్నింటికి మొదలు పవన్ అసలు హుజురాబాద్‌లో ప్రచారం చేయాలి కదా. మరి ఈ విషయంలో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!