Tollywood : టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. అప్పట్లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ విచారించింది. వారి నమూనాలను కూడా సేకరించింది. అప్పట్లో ఏర్పాటైన సిట్ టీమ్ నిన్న మొన్నటి వరకు ఈ కేసును విచారణ చేసింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2021లో సదరు టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆ సిట్ టీమ్ క్లీన్ చిట్‌ను ఇచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టింది. దీంతో ఆ సెలబ్రిటీలకు మళ్లీ గుండెల్లో గుబులు మొదలైంది.

తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఆ టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన హైకోర్టు వెంటనే కేసును ఈడీకి అప్పగించింది. అలాగే తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వద్ద ఈ కేసుకు సంబంధించి ఉన్న మొత్తం ఆధారాలు, రికార్డులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలను ఈడీకి అప్పగించాలని హైకోర్టు ఆ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఆ డిపార్ట్‌మెంట్ వారు ఈడీకి వాటిని అప్పగించలేదు.
దీంతో ఈడీ మరోమారు హైకోర్టుకు విజ్ఞప్తి చేయగా.. ఎట్టకేలకు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సదరు రికార్డులు మొత్తాన్ని ఈడీకి అప్పగించింది. దీంతో ఈడీ ఈ కేసును తవ్వడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ కోణంలోనూ ఈ కేసును ఈడీ విచారించనుంది. దీంతో ఆయా టాలీవుడ్ సెలబ్రిటీలకు మళ్లీ గుబులు మొదలైంది. అయితే ఈడీ ఈ కేసును ఎంత మేర విచారిస్తుంది, సెలబ్రిటీల పాత్ర ఏమైనా ఉందా ? లేక మళ్లీ ఈ కేసు విచారణను అలాగే సాగదీస్తారా ? అన్న వివరాలు త్వరలో తెలియనున్నాయి..!