మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ గ్రామంలో వీధులలో మొసలి తిరుగుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మొసలిని కొంతమంది స్థానికులు గుర్తించారు. రాష్ట్రంలో భారీ వర్షపాతం తరువాత కృష్ణా నదిలో నీటి మట్టం పెరిగి మొసలి నీటి నుండి సులభంగా బయటకు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ తరువాత ఏమైంది ? అన్న వివరాలు తెలియలేదు.
కాగా కుండపోత వర్షాలు, కొండచరియలు విరిగి పడడం, వరదలతో మహారాష్ట్ర అల్లకల్లోలంగా మారింది. అక్కడ వరదల వల్ల ఎక్కువగా థానే, రాయ్‌ఘడ్, రత్నగిరి, సతారా, సాంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగి పడడం వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం వరకు 113 కు చేరుకుంది. గత 24 గంటల్లో వరదల కారణంగా 100 మంది తప్పిపోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు 50 మంది గాయపడ్డారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక కొల్హాపూర్ జిల్లాలో 40,882 మంది సహా రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల నుండి కనీసం 89,333 మందిని తరలించారు. కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో తీవ్ర వరదలు సంభవించే ప్రదేశమైన చిప్లున్‌ను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం సందర్శించారు. స్థానికుల బృందం సీఎం కాన్వాయ్‌ని అడ్డగించింది. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేశారు.
#WATCH | Maharashtra: A crocodile seen on the roads of Sangli district after the water level of Krishna river rose following heavy rainfall. pic.twitter.com/qJVvrFMJxe
— ANI (@ANI) July 25, 2021
గత 24 గంటల్లో పూణేలో ఒక మరణం సంభవించగా, థానే జిల్లాలో ఒక వ్యక్తి తప్పిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాయ్‌గడ్‌లో ఇప్పటివరకు 52, రత్నగిరిలో 21, సతారాలో 13, థానేలో 12, కొల్హాపూర్‌లో 7, సబర్బన్ ముంబైలో 4, సింధుదుర్గ్, పూణేలో 2 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
భారీగా కురిసిన వర్షాల కారణంగా కొల్లాపూర్, సాంగ్లి, సతారా, పూణేలోని మొత్తం 875 గ్రామాలు ప్రభావితమయ్యాయి, 1,35,313 మందిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. రత్నగిరిలోని 6 సహాయ శిబిరాల్లో సుమారు 2 వేల మందిని ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది. చిప్లున్ లోని వశిస్టి నదిపై భారీ వర్షం కురిసింది.