కడుపున పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు కొన్నిసార్లు కడుపుతీపి చంపుకొని బిడ్డల పట్ల ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈక్రమంలోనే క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ కొడుకు బాధను చూడలేని ఓ తండ్రి.. ఆ బాధ నుంచి తన కొడుకుకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో.. ఇంజక్షన్ ఇచ్చి ఆ కొడుకును చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్. అతనికి వన్నతమిళ్ కుమారుడు. సంవత్సరం క్రితం వన్నతమిళ్ కి కుడికాలి వేలికి ఒక కణతి ఏర్పడటంతో తమ కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా అది క్యాన్సర్ గడ్డ అని తేలింది. దీంతో ఎంతో బాధపడి ఆ తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకోవాలని ఎన్నో ఆసుపత్రులకు వెళ్లారు. అయితే రోజు రోజుకూ అతని ఆరోగ్యం క్షీణించడమే కాకుండా వైద్యం కూడా భారం కావడంతో.. ఆ కొడుకు ఎంతో నరకయాతన అనుభవించాడు.
తన కొడుకు పడుతున్న బాధను చూడలేక ఆ తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఈ క్రమంలోనే ఆ నరకం నుంచి తన కొడుకుకు విముక్తి కల్పించాలని పెరియ స్వామి సమీప బంధువులు ల్యాబ్ లో పనిచేస్తుండటంతో అతని సహాయంతో విషపు ఇంజక్షన్ తీసుకువచ్చి తన కొడుకుకు వేశారు. ఇలా మరణించిన తన కొడుకుని క్యాన్సర్ తో మరణించాడని చెప్పినప్పటికీ.. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.