జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాకిచ్చింది. ఆయన ఈమధ్యే తన మూడు పెళ్లిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే పవన్‌ను ఏపీ మంత్రులు సహా సీఎం జగన్ కూడా విమర్శించారు. అయితే ఇదే విషయమై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ క్రమంలోనే ఆ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్‌కు నోటీసులు జారీ చేశారు. మహిళలకు పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆదేశించారు.
పవన్ ఈ మధ్య జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తాను చట్టప్రకారం విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అన్నారు. ఏపీ మంత్రుల్లా 30 మందిని వెనకేసుకుని తిరగడం లేదన్నారు. మొదటి భార్యకు రూ.5 కోట్ల భరణం ఇచ్చానని.. రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇచ్చానని చెప్పారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ పవన్ తన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. అలాగే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలన్నారు.
ఇటీవల పవన్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారాన్ని రేపాయని పద్మ అన్నారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ పవన్ మాట్లాడిన మాటలకు మహిళా లోకం షాక్‌కు గురైందన్నారు. పవన్ తన మాటల్లోని తప్పును తెలుసుకోవాలని.. వెంటనే సంజాయిషీ ఇవ్వాలని అన్నారు. ఇన్ని రోజులైనప్పటికీ పవన్ లో పశ్చాత్తాపం లేదని.. మహిళల ఆత్మగౌరవం దెబ్బ తీసేలా మాట్లాడారని అన్నారు. పవన్ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సమాజంపై ప్రభావం ఉండదా.. అని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.