Kanmani Rambo Khatija Movie Review : అక్కినేని మాజీ కోడలు సమంత ఒకవైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్‌లు, మరో వైపు ఫొటో షూట్స్ తో అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత నటించిన తాజా చిత్రం కాతు వాకుల రెండు కాదల్. ఈ మూవీ ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో కన్మణి రాంబో ఖతీజా పేరుతో విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
కథ విషయానికి వస్తే రాంబో (విజయ్ సేతుపతి) పుట్టడంతోనే అతని తండ్రి చనిపోతాడు. తల్లికి మతి స్థిమితం లేక మంచానికే పరిమితం అవుతుంది. తమ వంశంలో ఎవ్వరికీ పెళ్లి కాదని, పెళ్లి అయినా కూడా ఏవో అశుభాలే జరుగుతాయనే ఊరి ప్రజల మూఢ నమ్మకాలను తొలగించేందుకు రాంబో తండ్రి ఓ అడుగు ముందుకు వేస్తాడు. పెళ్లి చేసుకుంటాడు.. తండ్రి కూడా అవుతాడు. కానీ రాంబో పుట్టిన మరుక్షణమే అతను చనిపోతాడు. దీంతో తమ నమ్మకమే నిజమని ఊరి ప్రజలంతా అనుకుంటారు. అలా రాంబో మేనత్త, బాబాయ్‌లు పెళ్లి కాకుండానే జీవితాన్ని కొనసాగిస్తుంటారు.
కనీసం చాకోబార్ ఐస్ క్రీమ్ పొందలేని దురదృష్ణవంతుడిగా ఫీలవుతాడు రాంబో. ఇక అందరికీ ఎంతో సులభంగా దొరికే వర్షం కూడా రాంబో మీద కురవదు. తాను దగ్గరగా ఉంటే కన్నతల్లికి కూడా ఏదో ప్రమాదం జరుగుతుందని రాంబో భావిస్తాడు. దీంతో రాంబో తన తల్లి కోసం, ఆమె క్షేమం కోసం ఊరు వదిలి వెళ్లిపోతాడు. దూరంగా పెరుగుతుంటాడు. అలాంటి రాంబో జీవితంలోకి కణ్మణి (నయనతార), ఖతీజా (సమంత)ల ఎంట్రీ ఎలా జరిగింది ? వారిద్దరూ రాంబో జీవితాన్ని ఎలా మార్చేశారు ? ఇద్దరినీ ఒకే సారి ప్రేమించిన రాంబో చివరకు ఏం చేశాడు ? అసలు ఒకే వ్యక్తిని ప్రేమించిన కణ్మణి, ఖతీజాలు చివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ? ఊరి ప్రజల మూఢ నమ్మకాన్ని, తమ వంశానికి ఉన్న శాపాన్ని రాంబో అధిగమించాడా ? అనేదే కథ.
విజయ్ సేతుపతి, సమంత, నయనతార ఈ ముగ్గురూ తమ పాత్రలలో నటించి మెప్పించారు. ప్రపంచంలో అత్యంత దురదృష్ణవంతుడిగా విజయ్ సేతుపతి తనలో తాను బాధపడే సీన్స్‌లో అయినా, తనకు కావాల్సినవన్నీ దొరికిన సమయంలో సంతోష పడే సీన్స్‌లో అయినా విజయ్ సేతుపతి అద్భుతంగా నటించేశాడు. ఇక నయనతారకు కాస్త సాఫ్ట్ రోల్ ఇచ్చిన విగ్నేశ్ శివన్.. సమంతకు మాత్రం ఖతీజా రూపంలో కాస్త రఫ్ అండ్ టఫ్ పాత్రను ఇచ్చేశాడు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీలను మనం ఇది వరకు ఎన్నో చూసి ఉంటాం. ఈ సినిమాలో కూడా రాంబో పాత్ర అలాగే ఉంటుంది. ప్రేమకే దూరమైన రాంబోకి.. ఒకే సారి ఇద్దరమ్మాయిలు ప్రేమిస్తున్నామని ప్రపోజ్ చేస్తారు. పైగా రాంబోకి ఆ ఇద్దరూ ప్రాణమే. ఆ ఇద్దరు వచ్చాకే తన జీవితం మారిపోయిందని అనుకుంటాడు. అలాంటి రాంబో ఆ ఇద్దరినీ కాదనలేకపోతాడు. అయితే ఈ సంఘర్షణను ప్రేక్షకుడి మనసును తాకేలా, హత్తుకునేలా మాత్రం విగ్నేశ్ శివన్ చేయలేకపోయాడు.
కణ్మణి, ఖతీజాల వైపు నుంచి కూడా ఆ ప్రేమను అంత బలంగా చూపించలేకపోయాడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా సీరియస్‌నెస్ కనిపించదు. విగ్నేశ్ శివన్ స్టైల్లో మాదిరిగానే హాస్యాన్ని జోడిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలోని గాఢతను మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అంతగా మెప్పించలేదనిపిస్తోంది. కానీ కామెడీ కోసం ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.