Devi Sri Prasad : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ మూవీ డిసెంబర్ 17వ తేదీన విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. అయితే ఈ సమావేశం సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాడిన పాటలు వివాదాస్పదంగా మారాయి.
మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా దేవి శ్రీ ప్రసాద్ పాటలు పాడాడని.. ఐటమ్ సాంగ్‌లను భక్తి పాటలుగా మార్చి పాడడమే కాకుండా.. ఆ పనిని ఆయన సమర్థించుకున్నాడని, అంతేకాదు, ఐటమ్ సాంగ్‌లు అన్నింటినీ ఇలా భక్తి పాటలుగా మార్చుకోవచ్చని చెప్పడం తమ మనోభావాలను కించపరిచిందని.. పేర్కొంటూ రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దేవిశ్రీప్రసాద్ నిజంగానే ఆ విధంగా చేశారా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
దేవిశ్రీప్రసాద్ తాను సంగీత దర్శకత్వం వహించిన రింగ రింగా అనే పాటను భక్తి పాటగా మార్చి పాడారు. రింగ రింగా బదులు స్వామి స్వామి అని పెట్టేస్తే భక్తి పాట అవుతుందని చెబుతూ ఆ విధంగా పాడి చూపించాడు. అలాగే పుష్ప మూవీలోని ఊ అంటావా మావా.. ఉహూ అంటావా మావా.. పాటనూ మార్చేసి పాడాడు. మావా బదులుగా మళ్లీ స్వామి అనే పదం వాడాడు. అలాగే ప్రసాదం, పూలు, కొండ అనే పదాలను కూడా వాడాడు.
ఇలా రెండు ఐటమ్ సాంగ్ లలోనూ స్వామితోపాటు పలు పదాలను కలిపి పాడి వాటిని అలా భక్తి పాటలుగా పాడవచ్చని, తప్పేమీ లేదని అన్నాడు. “All item songs are devotional songs..” అంటే ఐటమ్ సాంగ్స్ అన్నీ భక్తి పాటలే.. అదొక మెడిటేషన్ అని దేవి అన్నాడు. దీంతో వివాదం రాజుకుంది. ఇవే విషయాలను ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఫిర్యాదులో సైతం పేర్కొన్నారు. అయితే స్టేజిపై పుష్ప టీమ్ మొత్తం ఉంది. దేవి అలా పాటలను పాడుతుండగా.. వారు బిగ్గరగా నవ్వేశారు తప్ప వారించే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే టీవీ 9 చానల్‌లో ఈ క్లిప్ ప్రసారం కాగా.. దాన్ని కూడా రాజాసింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ఆ చానల్‌కు చెందిన లింక్ (https://youtu.be/Ga9KHW7BofY) యూట్యూబ్‌లో కనిపించడం లేదు. ఆ వీడియోను వారు తొలగించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇంకో లింక్‌లో మాత్రం వీడియోను మళ్లీ పోస్ట్ చేశారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అలా ఐటమ్ సాంగ్‌లను భక్తి పాటలుగా మార్చి పాడినందుకు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని, కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని, దేవిశ్రీప్రసాద్ క్షమాపణలు చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.