Allu Arjun : మెగా ఫ్యామిలీ హీరోలు వీలైనప్పుడల్లా మంచి మనసు చాటుకుంటూనే ఉన్నారు. అభిమానులకి లేదా కష్టాలలో ఉన్న వారికి సాయం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమాని కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకొని.. అతడికి భారీ మొత్తం సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. గతంలో చాలా సార్లు బన్నీ తన మంచి మనసు చాటుకున్నాడు. కేరళలో భారీ వరదలు ముంచెత్తినప్పుడు కూడా అల్లు అర్జున్ లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అర్జున్ కుమార్ అనే వ్యక్తి.. బన్నీకి వీరాభిమాని కాగా, అతని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు.
వైద్యం కోసం అతనికి రెండు లక్షల రూపాయలు అవసరం కాగా, అర్జున్ కుమార్‌కి అంత మొత్తాన్ని భరించే శక్తి లేదు. అర్జున్ తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకున్న బన్నీ అభిమానులు.. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఈ విషయం కాస్త.. గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన స్వయంగా బన్నీని కలిసి.. అర్జున్ కుమార్ పరస్థితిని వివరించాడు. దీంతో చలించిపోయిన బన్నీ.. అర్జున్ కుమార్ తండ్రి వైద్యానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని మాట ఇచ్చాడట. అంతేకాక చికిత్సకు అవసరమైన మొత్తాన్ని పంపించి కష్టాల్లో ఉన్న అభిమానిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

అయితే తన పరిస్థితిని తెలుసుకొని వెంటనే స్పందించిన అర్జున్ కుమార్ ‘‘నన్ను గుర్తు పెట్టుకున్నావ్.. నా ఫోటో చూడగానే.. నన్ను గుర్తు పట్టావ్. నేను నీకు తెలుసు అన్నావ్. ఆ మాట విని ఆనందంతో ఏడ్చేశాను అన్న. నా కుటుంబానికి నీవు చేసిన సాయాన్ని ఎన్నటికి మరవను. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నా’’ అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అర్జున్ కుమార్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక బన్నీ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని బారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్గాత్మకంగా రూపొందిస్తున్నారు.