సాధారణంగా మన హిందూ సాంప్రదాయాలలో వివాహం రోజు చిన్న కుండలు లేదా గరికే ముంతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వివాహానికి ముందు రోజు కుండలను కొనుగోలు చేసి దేవుడి గుడిలో పెట్టి వివాహ ముహూర్తం రోజు పెద్ద ఎత్తున మేళాలతో వెళ్లి కుండలకు పూజచేసి ఊరేగింపుగా తీసుకు వస్తారు. అసలు వివాహంలో ఈ కుండల ప్రాముఖ్యత ఏమిటి? ఇలా తీసుకు రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ విధంగా వివాహ సమయంలో కుండలను పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి పూజ జరిగినట్లేనని భావిస్తారు. పెళ్లిలో ఈ విధంగా కుండలకు పూజించే ఆచారం ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే.. ద్రౌపతి తన వివాహ సమయంలో ఎంతో సంతోషంతో పక్కనే ఉన్న కలశం నెత్తిన పెట్టుకొని ఆనందంతో చిందులు వేసిందని, అలా కుండలు ఎంతో పవిత్రతను పొందాయని భావించి అప్పటి నుంచి పెళ్లిలో ఈ విధంగా కుండలను తీసుకురావడం ఒక ఆచారంగా వస్తోంది.
ఈ విధంగా పెళ్లి సమయంలో కుండలను పూజించడంవల్ల సాక్షాత్తు ఆ గౌరీదేవిని పూజించినట్లేనని భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ కుండలను పెళ్లి సమయంలో వధూవరుల చేత పూజ చేయిస్తారు. మరికొన్ని ప్రాంతాలలో వధువు తన అత్త వారి ఇంటికి వెళ్లే సమయంలో కూడా వీటిని తనతో పాటు పంపించి అక్కడ కూడా ఆ కుండలను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఈ విధంగా వివాహ సమయంలో కుండలకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు.