Pawan Kalyan : జనసేన పార్టీ పెట్టి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ ఇతర పార్టీలను ప్రశ్నించడం ఏమోగానీ ఇప్పటికే ఆయన చేసే సినిమాల సంఖ్య తగ్గింది. అయితే కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా కోలుకోలేని విధంగా నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకునే యత్నంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను ఒంటరిని చేస్తున్నాయని చెప్పవచ్చు.

రిపబ్లిక్ మూవీ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఆయన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. అయితే ఏపీ ఫిలిం చాంబర్ తమకు పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని, ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని అప్పుడే లేఖను విడుదల చేసింది. ఇక ఈ దుమారం చిలికి చిలికి గాలి వానగా మారుతుండడంతో సినీ నిర్మాతలు రంగంలోకి దిగి తమ భవిష్యత్ సినిమాలకు నష్టం కలగకూడదని ఏపీ మంత్రి పేర్ని నానిని కలిశారు. దీంతో పవన్ మాకొద్దు అని వారు చెప్పకనే చెప్పినట్లు అయింది.
సాధారణంగా పవన్ కల్యాణ్ అంటే ఆయనతో ఒక్క సినిమా చేయాలని ఏ నిర్మాత అయినా, దర్శకుడు అయినా భావిస్తారు. కానీ ఇప్పుడలా కాదు. ఆయనతో సినిమా చేయాలంటే తలనొప్పి ఎందుకని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకనే వారందరూ మూకుమ్మడిగా వెళ్లి ఏపీ మంత్రిని కలిశారు. పవన్‌తో సినిమా చేస్తే.. ఆయన ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ పోతే తమకు నష్టం కలుగుతుందని వారి భావన. అందుకనే వారు తమకు భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను ఇప్పుడే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.
అయితే పవన్ ముందు ముందు ఎవరైనా నిర్మాతలతో సినిమాలు చేస్తారా ? ఆయనతో సినిమాలు చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తారా ? ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో ఎవరు సినిమాలు తీస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ నాయకులు, ఇతర సినీ సెలబ్రిటీలు ఆయనను పక్కన పెట్టినా, ఆయనకు దూరంగా ఉన్నా పెద్దగా నష్టం ఏమీ లేదు. కానీ నిర్మాతలంతా ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా ముందుకు సాగితే అది పవన్‌కు సినిమాల పరంగా నష్టం చేస్తుంది. ఆయన భవిష్యత్తులో సినిమాలు చేయాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దీనికి సమాధానం తెలియాలంటే పవన్ కొత్త సినిమా విడుదల అయ్యే వరకు, మరో సినిమా చేసే వరకు వేచి చూడాల్సిందే.