Hyderabad : గత రెండు రోజుల కిందట హైదరాబాద్‌లోని మణికొండ నాలాలో గోపిశెట్టి రజనీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతైన విషయం విదితమే. అయితే రజనీకాంత్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్న నాలాలో పడ్డ రజనీకాంత్ కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అతని మృతదేహం లభించింది.
మణికొండలో నివాసం ఉంటున్న గోపిశెట్టి రజనీకాంత్ షాద్ నగర్‌లోని నోవా గ్రీన్ అనే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం రాత్రి 9 గంటలకు అతను ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం మణికొండలోని గోల్డెన్ టెంపుల్ వద్ద అతను మ్యాన్ హోల్‌లో పడిపోయాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడ్డ రజనీకాంత్ గల్లంతయ్యాడు.
కాగా ఈ విషయం తెలుసుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మణికొండ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు గాలించారు. ఈ క్రమంలోనే నెక్నంపూర్ చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.