చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 9వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ముంబై నిర్దేశించిన ఒక మోస్తరు లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ ఛేదించలేక చేతులెత్తేసింది. గత మ్యాచ్‌లో లాగానే హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. బౌలర్లు చక్కని ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే కట్టడి చేసినా బ్యాట్స్‌మెన్ మాత్రం విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ అలాగే విఫలమయ్యారు. దీంతో హైదరాబాద్‌పై ముంబై 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో క్వింటన్ డికాక్, కిరన్ పొల్లార్డ్, రోహిత్ శర్మలు రాణించారు. 39 బంతుల్లో 5 ఫోర్లతో డికాక్ 40 పరుగులు చేయగా, 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ 32 పరుగులు చేశాడు. పొల్లార్డ్ 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమన్, విజయ్ శంకర్‌లు చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. ఖలీల్ అహ్మద్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు మాత్రమే రాణించారు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో వార్నర్ 36 పరుగులు చేయగా, 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో బెయిర్ స్టో 43 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్‌లు చెరో 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. జస్‌ప్రిత్ బుమ్రా, క్రునాల్ పాండ్యాలకు చెరొక వికెట్ దక్కింది.