ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. కానీ ఆమె మాత్రం ప్రేమ అంటూ ధ్యాసను మరల్చింది. తల్లిదండ్రులు మందలించే సరికి ఏకంగా వారికి చెప్పకుండా తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో అవమానంగా ఫీలయ్యారు. విషం తాగి తనువులు చాలించారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఉన్న కున్నతూర్ ప్రాంతం పొలాయంపాలయంకు చెందిన ఆర్.పొన్ను స్వామి (65) బోర్‌వెల్ వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య పి.సుమతి (55) గృహిణి. కుమార్తె జనని (22) ఫిజియోథెరపీ విద్యను అభ్యసిస్తోంది. మరికొంత కాలం అయితే చదువు పూర్తి చేసుకుని చక్కగా ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు అండగా నిలబడి ఉండేది. కానీ ప్రేమ ఆమె ధ్యాసను మరల్చింది.
అదే ప్రాంతానికి చెందిన సంపత్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించడం మొదలు పెట్టింది. వీరి విషయం పొన్నుస్వామికి తెలిసింది. దీంతో ఆ దంపతులు జనని ని మందలించారు. చక్కగా చదువుకోవాలని చెప్పి హితవు పలికారు. కానీ ఆమె వినిపించుకోలేదు.
ఇటీవలే ఒక రోజు ఆమె కోయంబత్తూరులోని కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఆ రోజు ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అయితే ఆమె సంపత్‌ను పెళ్లి చేసుకుంది. తరువాత ఫొటోలను వాట్సాప్‌లో తన తల్లిదండ్రులకు పంపించింది.
దీంతో అవమానంగా భావించిన పొన్ను స్వామి, సుమతిలు శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఇరుగు పొరుగు వారు వారిని గమనించి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.