సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని బ్యాంకింగ్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. అచ్చం బ్యాంకు నంబర్లలాగే ఉండే ఫోన్ నంబర్లతో కొందరు దుండగులు కాల్స్ చేస్తున్నారు. బ్యాంకు వివరాలను చెప్పమని అడుగుతున్నారు. దీంతో నిజంగానే బ్యాంకు నుంచి కాల్ చేశారు కావచ్చని చెప్పి చాలా మంది వివరాలను చెబుతున్నారు. డబ్బులు నష్టపోతున్నారు. అందుకనే అలాంటి కాల్స్, నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది.
సాధారణంగా బ్యాంకులకు చెందిన టోల్ ఫ్రీ నంబర్లు 1800 223 464 తరహాలో ఉంటాయి. అంటే ముందుగా 1800 ఉంటుంది. అయితే మోసగాళ్లు 1800 లో 1 లేకుండా 800 తో మొదలు పెట్టి నంబర్లు ఉండే ఫోన్ నంబర్లతో కాల్స్ చేస్తున్నారు. అంటే.. ముందు ఇచ్చిన 1800 223 464 నంబర్లో 1 లేకపోతే 800 223 464 అవుతుందన్నమాట. ఇలాంటి నంబర్లతో కాల్స్ చేస్తున్నారు.
ఇక కస్టమర్లకు కూడా అవి బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్లలాగే అనిపిస్తున్నాయి. దీంతో వారు నిజంగానే బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తున్నారేమోనని చెప్పి అవతలి వ్యక్తి అడిగిన ప్రతి సమాచారం చెబుతున్నారు. ముఖ్యమైన బ్యాంకింగ్ వివరాలను చెబుతున్నారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నంబర్లు, పాస్వర్డ్లు, పిన్లను చెబుతున్నారు. దీంతో మోసగాళ్లు ఆ వివరాలతో క్షణాల్లోనే డబ్బులు మాయం చేస్తున్నారు. తరువాత వినియోగదారులు డబ్బులు పోయి లబోదిబోమంటున్నారు.
కనుక ఎవరికైనా సరే పైన తెలిపిన విధంగా ఉండే నంబర్లతో కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఎస్బీఐ కూడా ఇదే విషయంపై తన కస్టమర్లకు మెసేజ్లను పంపిస్తోంది.