కరోనా వల్ల గతేడాది చాలా ఆలస్యంగా ఐపీఎల్ జరిగినప్పటికీ ప్రస్తుతం మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ ప్రారంభమైంది. ఐపీఎల్ 14వ ఎడిషన్ ఈ నెల 9వ తేదీన ప్రారంభం అయింది. వేసవిలో క్రికెట్ అభిమానులకు ఎప్పటిలా ఐపీఎల్ వినోదాన్ని అందించనుంది. అయితే ఐపీఎల్ వల్ల ఈ సారి ఈ-కామర్స్ సంస్థలు, ఫుడ్ డెలివరీ యాప్‌లకు ఎంతగానో మేలు జరుగుతుందని, వారి వ్యాపారాలు జోరుగా కొనసాగుతాయని పలువురు వ్యాపారవేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లాక్‌డౌన్ సమయంలో చాలా మంది సోషల్ మీడియా, టీవీలకు అతుక్కుపోయారు. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో విహరించారు. ప్రస్తుతం సరిగ్గా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అనేక చోట్ల పాక్షిక లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగించాయి. కనుక ఇప్పుడు కూడా అలాగే వాటి వ్యాపారం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఎల్‌ను ఈసారి చాలా మంది టీవీల్లోనే వీక్షిస్తారు కనుక ఆ మ్యాచ్‌లలో యాడ్స్ ను ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని, తద్వారా బిజినెస్ ఎక్కువగా చేయాలని ఈ-కామర్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందువల్ల ఐపీఎల్ ఈసారి ఈ-కామర్స్ సంస్థలకు సహాయం చేస్తుందని చెప్పవచ్చు.
ఇక కరోనా వల్ల అనేక చోట్ల నిబంధనలను విధించారు. బార్లు, రెస్టారెంట్లను మూసి వేశారు. ఐపీఎల్ ఉన్న రోజుల్లో ప్రేక్షకులు వాటికి వెళ్లి మ్యాచ్‌లను వీక్షిస్తూ మద్యం, ఫుడ్ తీసుకుంటూ ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడవి లేవు. దీంతో ఇళ్లలో లేదా బంధువులు, స్నేహితులతో కలసి ఒక్క చోట కూర్చుని మ్యాచ్‌లను ఎంజాయ్ చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. కనుక వారు సహజంగానే ఫుడ్ కోసం ఫుడ్ డెలివరీ యాప్‌లపై ఆధార పడతారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఈ వ్యాపారానికి కూడా మేలు చేయనుంది. మరి ఈసారి ఐపీఎల్ వల్ల ఆయా రంగాలు ఎంతగా లాభ పడతాయో చూడాలి.