సాధారణంగా కొన్నిసార్లు మనం పొలం పనులు చేసుకుంటున్నప్పుడు పొలంలో మనకు ఎన్నో విలువైన వస్తువులు దొరుకుతుంటాయి. కొందరికి వజ్రాలు దొరకగా మరికొందరికి బంగారం దొరికిన సంఘటనలను గురించి ఎన్నో విన్నాం. తాజాగా జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో ఓ రైతు పంటల పొలంలో కూడా ఓ లంకెబిందె దొరికింది. ఈ బిందె నిండా బంగారు ఆభరణాలు ఉన్నట్లు రెవెన్యూ, పోలీస్ అధికారులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
హైదరాబాద్‌కు చెందిన నర్సింహ పెంబర్తి గ్రామ పరిధిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ పొలంలో వెంచర్ ఏర్పాటు చేయాలని భావించిన నరసింహ పొలం మొత్తం జెసిబి తో చదును చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే పొలంలో ఒక లంకె బిందె లభ్యమయింది. వెంటనే నరసింహ ఈ విషయాన్ని అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
రెవెన్యూ అధికారులు లంకెబిందెను తెరిచి చూడగా అందులో17 తులాల బంగారం,10 కిలోల వెండి ఉన్నట్లు గుర్తించారు.ఈ క్రమంలోనే పొలం యజమాని మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అమ్మవారు కలలో కనిపించి ఆలయం కట్టించాలని కోరినట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్, తహసిల్దార్, గ్రామ సర్పంచ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించారు.అయితే ఈ విషయంలో పురావస్తు శాఖ అధికారులు స్పందించి మరిన్ని తవ్వకాలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.