ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఎంతో మధురమైన జ్ఞాపకం. ఈ వివాహం వారి జీవితంలో పదికాలాలపాటు గుర్తుండే విధంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వధూవరులు పెళ్లికి వచ్చిన వారందరి దృష్టి తమపై ఉండాలని, ఎంతో ఖరీదైన దుస్తులతో అందంగా ముస్తాబవుతారు. కానీ ఇండోనేషియాలో మాత్రం ఓ వరుడు ఇందుకు భిన్నంగా షార్ట్ వేసుకుని పెళ్లికి హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పెళ్లిలో వరుడి శరీరమంతా గాయాలతో,కట్లు కట్టుకొని వివాహానికి హాజరు కాగా, వధువు మాత్రం కుందనపు బొమ్మలా తయారయ్యి వరుడు పక్కన కూర్చుంది.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు “పాపం పెళ్లి కొడుకుకి ఈ పెళ్లి ఇష్టం లేదేమో”, అని కామెంట్ చేయగా మరికొందరు అసలు కారణం ఏమిటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ కామెంట్ల పై స్పందించిన వధువు తన భర్త పెళ్లిలో ఈ విధంగా రావడానికి అసలు కారణం తెలియజేసింది. ఈ పెళ్లి మా ఇద్దరికీ ఇష్టమే, కానీ పెళ్లికి కొద్ది రోజుల ముందు తన భర్త పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. అందుకే ఈ విధంగా ఒళ్లంతా గాయాలయ్యాయని, బట్టలు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో షార్ట్ వేసుకుని పెళ్లికి హాజరయ్యారని అసలు విషయం తెలిపింది.