మనకు ఏ కాలాలతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో అరటి పండ్లు ఒకటి. అరటి పండ్లకు ఆరోగ్య పరంగాను, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ పూజ జరిగినా తప్పనిసరిగా ఆ దేవుడికి నైవేద్యంగా అరటిపండ్లను సమర్పిస్తాము. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా ముత్తయిదువులు వచ్చిన తాంబూలంలో అరటి పండ్లను ఇస్తాము. అయితే అరటి పండ్లలో కవల అరటి పండ్లు రావడం మనం చూస్తూ ఉంటాము. కవల అరటి పండ్లు ఎంతో మంచిదని భావించి తాంబూలంలో ఇస్తారు. అయితే కవల అరటిపండ్లను తాంబూలంలో ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. అలా ఎందుకు ఇవ్వకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం విష్ణుమూర్తి శాపం వల్ల రంభ భూమిపై అరటి చెట్టుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే రంభ తనకు శాపవిమోచనం కల్పించాలని విష్ణుమూర్తిని వేడుకోగా.. అప్పుడు విష్ణుమూర్తి అరటి చెట్టు నుంచి వచ్చే పండ్లను దేవుడికి నైవేద్యంగా సమర్పించే పవిత్రమైన హోదాను కల్పించాడు. ఈ క్రమంలోనే అరటి పండును దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు కానీ తాంబూలంలో ఇవ్వకూడదు.
కవల అరటిపండ్లలో చూడటానికి రెండు పండ్లు ఉన్నప్పటికీ, అది ఒక పండు కిందకే సమానం. కాబట్టి తాంబూలంలో ఒక అరటి పండును ఇవ్వకూడదు. అందుకోసమే ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు తాంబూలంలో కవల అరటిపండును ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.