Money In Purse : లక్ష్మీ దేవి కృప, దయ, అనుగ్రహం మనపై ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లక్ష్మీ దేవిని భక్తిశ్రద్దలతో నిత్యం పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కృప మనపై ఉంటే ఎప్పుడూ సంతోషంగా, డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని భావిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో సూచించబడిన అనేక మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో లక్ష్మీ దేవిని అనుగ్రహాన్ని పొందడానికి కావల్సిన మార్గాలతో పాటు ఆమె ఆగ్రహానికి గురి అయ్యే విషయాల గురించి కూడా చెప్పబడింది. సాధారణంగా మనం తెలిసీ, తెలియక చేసే ఈ తప్పులే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యేలా చేస్తాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ దేవి కోపానికి గురైతే మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
జీవితంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మీ దేవికి ఆగ్రహాన్ని తెప్పించే కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ దేవికి, డబ్బుకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. చాలా మంది డబ్బు నోట్లను లెక్కించేటప్పుడు వేళ్లకు ఉమ్మితో తడి చేసుకుని లెక్కిస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇది చాలా పెద్ద తప్పని పండితులు చెబుతున్నారు. ఉమ్మితో డబ్బును లెక్కించడం వల్ల లక్ష్మీ దేవిని అవమానించినట్టేనని వారు తెలియజేస్తున్నారు. కనుక నోట్లను లెక్కించేటప్పుడు చేతులకు నీటితో తడి చేసుకుని లెక్కించడం మంచిది. అలాగే పర్సులో డబ్బును మడతపెట్టి ఉండకూడదు. ఇది సంపదను అవమానించడంతో పాటు లక్ష్మీ దేవికి అసంతృప్తిని కలిగిస్తుంది. అదే విధంగా పర్సులో పాత బిల్లులు, అనవసర కాగితాలను ఉంచకూడదు.
ముఖ్యంగా పదునైన వస్తువులను అస్సలు ఉంచకూడదు. మనం చేసే ఈ పొరపాటు ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మురికి చేతులతో పర్సును ఎప్పుడూ తాకకూడదు. సంపదకు రూపమైన లక్ష్మీదేవి పర్సులో నివసిస్తుంది. మురికి చేతులతో పర్సును తాకడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అదే విధంగా చిరిగిన, పాడైపోయిన, పాతబడిన పర్సును ఉపయోగించవద్దు. పర్సు తక్కువ ధరది అయినా, ఎక్కువ ధరది అయినా అది మంచి స్థితిలో ఉండడం అవసరం. ఈ విధంగా మనం తెలియక చేసే ఈ తప్పులే మనం లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి అయ్యేలా చేస్తాయని కనుక ఈ తప్పులను సరిదిద్దుకోవడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు.