రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన నటుడు, సినీ విమర్శకుడు చెన్నై అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందిన విషయం విదితమే. కాగా కత్తి మహేష్ మృతిపై ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. కత్తి మహేష్ మృతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కారులో ముందు కూర్చున్న కత్తి మహేష్ చనిపోగా.. పక్కనే ఉన్న వ్యక్తికి చిన్న గాయం లేకుండా ఎలా బతికాడని మందకృష్ణ ప్రశ్నించారు. కత్తి మహేష్‌కు అనేక మంది శత్రువులు ఉన్నారని అన్నారు. కారు కూడా కత్తి మహేష్ కూర్చున్న వైపుకే డ్యామేజ్ అవడం అనుమానాలకు తావిస్తుందన్నారు.
కత్తి మహేష్ కు మొదట అసలు గాయలే కాలేదన్నారు. కత్తి మహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయన గురించి దారుణంగా కామెంట్స్ చేశారని మందకృష్ణ చెప్పారు. కత్తి మహేష్ అంత్యక్రియలకి హాజరైన అనంతరం మందకృష్ణ చిత్తూరు జిల్లా యల్లమందలో పై విధంగా మాట్లాడారు.
కత్తి మహేష్ మృతిపై నిజాయితీ ఉన్న ఉన్నతాధికారులు, లేదంటే సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని, 15 రోజులు జరిగిన ట్రీట్‌మెంట్ ఏంటన్నది ఆస్పత్రుల నుంచి బయటకు రావాలని, ప్రమాదం జరిగిందా, లేదా, మృతి వెనుక మిస్టరీ ఉందా, లేదా అన్న విషయం తేలాలని మందకృష్ణ మాదిగ అన్నారు.