ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలా కుతలం చేసింది. ఎంతో మందిని బలి తీసుకుంది. ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతూ భీభత్సం సృష్టించింది. అయితే కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా ఇంకో వ్యక్తికి కోవిడ్ సోకుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ దోమలు కుట్టడం వల్ల కోవిడ్ వ్యాప్తి చెందుతుందా ? అని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. మరి అందుకు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వెలువడే తుంపర్ల వల్ల మాత్రమే ఆ వ్యాధి ఇంకొకరికి సోకుతుంది. కానీ దోమల వల్ల వ్యాప్తి చెందదు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్వయంగా వెల్లడించింది. దోమల నుంచి కోవిడ్ వ్యాప్తి చెందాలంటే వాటికి కోవిడ్ ఇన్‌ఫెక్ట్ అవ్వాలి. అయితే కరోనా వైరస్‌ను వాటిలోకి ప్రవేశపెట్టినా ఇన్‌ఫెక్షన్ అవడం లేదని, వాటిపై కోవిడ్ ప్రభావం లేదని సైంటిస్టులు తమ పరిశోధనల్లోనే వెల్లడించారు. అందువల్ల దోమలకు కోవిడ్ సోకదు కనుక వాటి నుంచి మనుషులకు కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశమే లేదు. కనుక ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు.
దోమలు కుట్టడం వల్ల కోవిడ్ వ్యాప్తి చెందుతుందని ఎక్కడా నిరూపణ కాలేదన్నారు. దోమలు కుట్టడం వల్ల ఆ వైరస్ సోకేట్లయితే ఈపాటికే ఆ విషయం తెలిసేదని, అందువల్ల ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని సైంటిస్టులు చెబుతున్నారు.