సాధారణంగా మనం ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తప్పకుండా నవగ్రహాలు దర్శనమిస్తాయి. నవగ్రహాలు లేని శివాలయం అంటూ ఉండటం చాలా అరుదు. ఈ నవ గ్రహాలు ఆధారంగానే జ్యోతిష్యులు జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. అదే విధంగా ఈ గ్రహాల ప్రభావం మన పై అధికంగా ఉంటుంది. అయితే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాలలోనే ఎందుకు దర్శనమిస్తాయి? ఆ విధంగా శివాలయాలలో నవగ్రహాలు ఉండటానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు. ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. అయితే ఈ గ్రహాలు అన్నింటికీ మూలం సూర్యుడు. సూర్యునికి ఆది దేవుడు శివుడు. కనుక నవగ్రహాలన్ని శివుడి ఆదేశం మేరకు సంచరిస్తూ ఉంటాయి. అందుకోసమే నవగ్రహాలను ఎక్కువగా శివుడి ఆలయాలలో నిర్మిస్తుంటారు. మన జాతకం పై గ్రహ దోషాలు కూడా శివుడి ఆజ్ఞ మేరకే జరుగుతాయని ఈ సందర్భంగా పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం మనం శివుడికి పూజలు చేయడం వల్ల నవగ్రహాల ప్రభావం మనపై ఉండదని భావిస్తారు. అందుకోసమే చాలా మంది భక్తులు శివుడికి వివిధ అభిషేకాలను పూజలు నిర్వహించినా కూడా నవగ్రహాలకు వెళ్లి దర్శనం చేసుకోరు. అయితే ప్రస్తుత కాలంలో చాల ఆలయాలలో నవగ్రహాలను నిర్మించడం జరుగుతుంది.