Sciatic Pain : కూర్చున్నా, నిలబడ్డా, కదిలినా తుంటి దగ్గర విపరీతమైన నొప్పి. భరించలేనంత బాధ. ఆ ప్రదేశంలో సూదులతో గుచ్చినట్టుగా ఉండడం, స్పర్శ జ్ఞానం సరిగ్గా లేకపోవడం.. ఇవి సయాటికా నొప్పి లక్షణాలు. వెన్ను నొప్పిలాగానే ఉంటుంది కానీ ఈ నొప్పి శరీరానికి కేవలం ఒకే వైపు అది కూడా తుంటి దగ్గర, పిరుదుల దగ్గర ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉండే సయాటిక్ నరం పనితీరులో మార్పు వల్లే ఈ నొప్పి వస్తుంది. అందుకే దీన్ని సయాటికా పెయిన్ అంటారు. నేటి తరుణంలో ప్రతి 100 మందిలో 40 శాతం మంది ఈ తరహా నొప్పితో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు వైద్యులు అందించే చికిత్సతోపాటు కింద ఇచ్చిన కొన్ని సూచనలు పాటిస్తే సదరు నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు వీలు కలుగుతుంది. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో ఉన్న అతి పెద్ద నరాలలో సయాటిక్ నర్వ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనికి అనేక రకాల చిన్న నాడులు కనెక్ట్ అయి ఉంటాయి. వెన్నెముక నుంచి ఈ నరం కాలి కిందకు వెళ్తుంది. దీనికి సంబంధించిన శాఖలు తొడలు, పిక్కలు, పాదాలు, బొటన వేలు వరకు విస్తరించి ఉంటాయి. వెన్నెముకలో ఉండే కొన్ని ప్రాంతాల్లో సయాటిక్ నర్వ్ ఒత్తిడికి గురవుతుంది. దీని వల్ల ఆ ఒత్తిడికి సంబంధించిన నొప్పి ఆ ప్రదేశం నుంచి కాలి కింది వరకు వ్యాపిస్తుంది. అయితే సయాటికా నొప్పి మరీ తీవ్రతరమైతే శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుంది. నేలపై బోర్లా పడుకుని, చేతులను నేలపై ఆనించి వాటిపై నెమ్మదిగా పైకి లేచి వంగాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండాలి. ఈ క్రమంలోనే తలను కొంత సేపు పైకి, కొంత సేపు కిందకి ఉంచి భంగిమను మార్చాలి.
చిత్రంలో ఇచ్చినట్టుగా ఈ ఆసనం వేస్తే సయాటికా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నేలపై బోర్లా పడుకుని చేతులను కింద ఆనిస్తూ కేవలం తల, ఛాతి భాగాలను మాత్రమే పైకి లేపి చిత్రంలో ఇచ్చినట్టుగా భంగిమను పెట్టాలి. ఇలా కొంత సేపు ఉండాలి. దీని వల్ల సయాటికా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ భంగిమలో ఉన్నప్పుడు నోటిని బాగా వెడల్పుగా చేసి నాలుకను వీలైనంత వరకు బయటికి ఉంచి శ్వాస తీసుకోవాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్‌ను పెట్టుకుని కొంత సేపు ఉంచాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. దీని వల్ల నొప్పి తగ్గిపోతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
వెన్నెముకపై నెమ్మదిగా మర్దనా చేస్తూ మసాజ్ చేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల సయాటికా పెయిన్ నుంచి బయట పడవచ్చు. శరీరంలోని పలు నిర్దిష్ట భాగాల్లో ఒత్తిడిని కలగజేయడం వల్ల అనారోగ్యాలను దూరం చేసుకునే ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ వైద్యాలను ప్రయత్నించాలి. వీటిని సరైన నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినా నొప్పిని కొంత వరకు తగ్గించుకోవచ్చు. బాగా ఎక్కువ సేపు కూర్చుని లేదా నిలుచుని పనిచేసే వారు మధ్య మధ్యలో తేలికపాటి వ్యాయామాలు చేయాలి. లేచి అటు, ఇటు నడవాలి. నిల్చునే వారైతే కొంత సేపు విరామంగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. ఇలా చేసినా నొప్పి తగ్గిపోతుంది. నిత్యం తగినంత సమయం పాటు నిద్ర పోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న ద్రవాలు సరైన స్థాయిలోకి వచ్చి నొప్పిని నియంత్రిస్తాయి.