చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆ యువతిని తల్లిదండ్రులు మేనమామలు అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. తన పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా తన వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోందని ఆమె కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. అయితే ఆ సంబరం ఎన్నో రోజులు నిలవలేదు. మృత్యువు రూపంలో వారి సంతోషాన్ని తుడిచి వేసింది. అత్తింట్లో పెట్టే బాధలు భరించలేక.. తన పుట్టింటికి చెప్పుకోలేక నరకయాతన అనుభవించిన యువతి ఈ నరకం కంటే చావే మంచిదని భావించి తన బిడ్డతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.
లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనెల రాజేశ్వరి(28)కి అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి భువనేశ్వరి అనే రెండు సంవత్సరాల పాప ఉంది. అదేవిధంగా రాజేశ్వరి మరో సారి గర్భం దాల్చిగా నెలలు కూడా నిండాయి. రాజేశ్వరి గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తోంది.అయితే నిత్యం తన అత్తింట్లో వేధించే బాధలను భరించలేక ఆ విషయాలను తమ పుట్టింటి వారితో చెప్పుకోలేక ఎంతో బాధను అనుభవించిన రాజేశ్వరి ఈనెల 23న తన భర్తతో గొడవపడి తన బిడ్డను అనాధగా మారకూడదని భావించి తనను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే శుక్రవారం చిన్నమురపాక సమీపంలోని నేలబావిలో తల్లీ బిడ్డ మృతదేహాలు కనిపించడంతో పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకుని అవి రాజేశ్వరి, భువనేశ్వరి మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే తమ సోదరి మేనకోడలు మరణానికి అత్తింటివారి బాధ్యులని రాజేశ్వరి సోదరుడు గన్నియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.