iPhone : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో కొత్త ఐఫోన్లను విడుదల చేస్తుందన్న విషయం విదితమే. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా కొత్త ఐఫోన్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈసారి ఐఫోన్ 14 మోడల్స్‌ను యాపిల్ రిలీజ్ చేయనుంది. అయితే నిన్న మొన్నటి వరకు రిలీజ్ డేట్‌పై అనేక ఊహాగానాలు వచ్చాయి. వాటన్నింటికీ తెర దించుతూ యాపిల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీన నూతన ఐఫోన్లను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యాపిల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ సారి సెప్టెంబర్ 7వ తేదీన యాపిల్ ఫార్ అవుట్ పేరిట ఓ ఈవెంట్ నిర్వహించనుంది. అందులోనే కొత్త ఐఫోన్లతోపాటు కొత్త యాపిల్ వాచ్‌ను సైతం రిలీజ్ చేయనున్నారు. ఈసారి ఐఫోన్‌లలో నాలుగు నూతన మోడల్స్‌ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఐఫోన్ 14, 14 ప్రొ, 14 మ్యాక్స్, 14 మ్యాక్స్ ప్రొ పేరిట నాలుగు మోడల్స్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. సాధారణ మోడల్ ఐఫోన్లలో 6.1 ఇంచుల డిస్ ప్లే, పాత యాపిల్ ఎ15 చిప్‌సెట్‌ను అమర్చనున్నారని తెలిసింది. ప్రొ మోడల్స్‌లో 6.7 ఇంచుల డిస్‌ప్లే, కొత్త యాపిల్ ఎ16 చిప్‌సెట్‌ను అందివ్వనున్నారని సమాచారం.

ఇక ప్రొ మోడల్స్‌లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెమెరాను అందివ్వనున్నారని తెలుస్తోంది. అయితే గతంలో ఐఫోన్ 12, 13 మినీల మాదిరిగా ఈ సారి ఐఫోన్ 14 మినీ ఉండదని సమాచారం. మినీ మోడల్స్‌కు అంతగా ఆదరణ లభించడం లేదు. కనుక ఈసారి మినీ మోడల్ ఉండదని తెలుస్తోంది. ఇక ఈసారి వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్‌లను కూడా యాపిల్ ఈ ఈవెంట్ లో రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. అయితే కొత్త ఐప్యాడ్, ఎయిర్ పాడ్స్, మ్యాక్ ప్రొలను మాత్రం అక్టోబర్‌లో రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది.
కాగా యాపిల్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 7వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు లైవ్‌లో వీక్షించవచ్చు. యూట్యూబ్‌లోని యాపిల్ అధికారిక చానల్‌లో ఈ లైవ్‌ను స్ట్రీమ్ చేయనున్నారు. యాపిల్ పార్క్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.