Gharana Mogudu : ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. పాత హిట్ సినిమాలకి రీ రిలీజ్ పేరుతో స్పెషల్ షోలు వేయడం, అదే విధంగా తమ హీరో సినిమా కూడా ప్రదర్శించాలని అభిమానులు డిమాండ్ చేయడం జరుగుతోంది. ఇక ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వేసిన పోకిరి సినిమా స్పెషల్ షోలు బాగా విజయవంతం అవడంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా మూవీకి కూడా ఆయన పుట్టిన తేదీ అయిన సెప్టెంబర్ 2న స్పెషల్ షోలు వేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం కావడంతో ఒకప్పుడు ఆయన హీరోగా నటించి అదిరిపోయే విజయం సాధించిన ఘరానా మొగుడు సినిమాని కూడా రీ రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఒకవేళ అలా గానీ జరిగితే ఈ రెండు తేదీల్లో థియేటర్లు మెగా అభిమానుల సంబరాలతో మోత మోగిపోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక ఘరానా మొగుడు సినిమాకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమ సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఒక విధంగా ఇది మంచి పరిణామం అనే చెప్పవచ్చు. ఇలాగైనా ప్రేక్షకులు థియేటర్లకి దగ్గరవుతారని ఆశిస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి ఇది ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.