Anjana Devi : పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయింది. కానీ అక్టోబర్ 5వ తేదీ వరకు వేరే సినిమాలను చేసేందుకు ఆయన కాల్ షీట్స్ ఇచ్చారు. దీంతో వినోదయ సీతమ్ రీమేక్ ఎలాంటి చడీ చప్పుడు లేకుండానే ప్రారంభమైంది. ఇక ప్రస్తుతం పవన్ ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఏపీలో ఆత్మహత్య చేసుకున్న, ఇబ్బందులకు గురవుతున్న కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం జనసేన పార్టీ విరాళాలను కూడా సేకరిస్తోంది.
అయితే పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి జనసేన పార్టీకి చెందిన కౌలు రైతుల సంక్షేమ నిధికి తాజాగా రూ.1.50 లక్షల విరాళం ఇచ్చారు. అయితే ఆమె విరాళం ఇవ్వడం ఏమో కానీ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. అంజనాదేవికి నెల నెలా ప్రభుత్వం నుంచి ఫించన్ వస్తుంది. ఆయన భర్త పబ్లిక్ సర్వెంట్. కనుక ఆయన మరణం అనంతరం ఆమెకు పెన్షన్ అందిస్తున్నారు. అయితే ముగ్గురు కొడుకులు ఉండి.. అంతటి ధనవంతురాలు అయి ఉండి కూడా అంజనా దేవి ఇంకా ఫించన్ ఎందుకు తీసుకుంటుందో అర్థం కావడం లేదని.. దేశంలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని.. వీరంతా పుణ్యానికి ఫించన్ తీసుకుంటున్నారని.. అందుకనే దేశం ఇంకా ఈ స్థితిలోనే ఉందని.. బాగుపడడం లేదని.. కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయినా లేదా మరణించినా కుటుంబ సభ్యులకు వచ్చే ఫించన్ వారి జీతంలోంచి కట్ అయిందేనని.. కొత్తగా ఇచ్చేది ఏమీ ఉండదని.. అయినప్పటికీ తన భర్త డబ్బులతోనే అంజనా దేవి జీవిస్తుందని.. కొడుకులపై ఆధారపడడం లేదని.. ఇందులో తప్పేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో అంజనా దేవి ప్రస్తుతం అనవసరంగా విమర్శలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాయి.