స్విస్ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లె అప్పట్లో మ్యాగీ నూడుల్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ నూడుల్స్‌లో పరిమితికి మించి సీసం కలుస్తుందన్న కారణంతో ఆ సంస్థ తయారు చేసే మాగీ నూడుల్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. తరువాత మళ్లీ అడ్డంకులను తొలగించుకుని యథావిధిగా నూడుల్స్ అమ్మకాలను ప్రారంభించింది. కానీ తాజాగా మరో షాకింగ్ విషయం తెలిసింది.
మాగీ నూడుల్స్ ఉత్పత్తిదారు నెస్లే తన ఉత్పత్తుల్లో 60 శాతం ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవి కావని అంగీకరించినట్లు తెలిసింది. ఆరోగ్యకరమైనవి అనే నిర్వచనాన్ని అందుకోవడానికి నెస్లె యత్నించినా ఆ ప్రయత్నంలో ఆ సంస్థ విఫలమైంది. ఆ విషయాన్ని నెస్లె స్వయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రజలకు పౌష్టికాహారంతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు నెస్లె నడుం బిగించింది. అందులో భాగంగానే తన ఉత్పత్తులను కూలంకషంగా పరిశీలిస్తోంది. ఆ క్రమంలోనే నెస్లె తమ ఉత్పత్తుల్లో చాలా వరకు అనారోగ్యకరమైనవే ఉన్నాయని సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
నెస్లెకు చెందిన మెయిన్‌స్ట్రీమ్ ఫుడ్, డ్రింక్స్ పోర్ట్‌ఫోలియో హెల్త్, న్యూట్రిషన్ ప్రమాణాలను పాటించడంలో విఫలమైందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఆహార ఉత్పత్తుల కంపెనీ నెస్లె ఉత్పత్తుల్లో 60 శాతానికి పైగా ఉత్పత్తులు ఆరోగ్యకరంగా లేవని తెలిపింది. ఇక ఆస్ట్రేలియాలో నెస్లెకు చెందిన ఉత్పత్తులకు 3.5 రేటింగ్ ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయంపై తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తామని నెస్లె తెలిపింది.