Ravi: బుల్లితెరపై తనదైన మాటలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన యాంకర్ రవి. ఈయన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో సందడి చేశారు. ఈ షో రవికి పాజిటివిటీ కన్నా నెగెటివిటీనే ఎక్కువగా పంచింది అని చెప్పాలి. రవి కావాలని అన్నింట్లో తలదూర్చుతున్నాడని, ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడంటూ నానామాటలు అన్నారు. అతనినే కాదు రవి భార్య నిత్య, కూతురు వియాని కూడా దూషించారు.
బయటకు వచ్చిన రవి తనమీద, తన కుటుంబం మీద జరుగుతున్న ట్రోలింగ్‌ను చూసి తట్టుకోలేకపోయాడు. నన్ను నెగెటివ్‌గా చూపించారు అని మొత్తుకుంటున్నా కొందరు నెటిజన్లు అతడిని విమర్శించడం మానుకోలేదు. తను సిరికి సపోర్ట్ చేయడాన్ని సహించలేకపోయిన కొందరు రవి కూతుర్ని కూడా మధ్యలోకి లాగారు. దీంతో ఓపిక నశించిన రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
తన పై ఎన్ని రకాల కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. తన కుటుంబసభ్యుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్ కామెంట్ కు సమాధానం చెప్పాల్సిందే అని రవి అంటున్నారు. ఇక యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడని తెలుస్తుంది.