Allu Arjun : అల్లు అర్జున్ నటించిన తాజా యాడ్ ర్యాపిడో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ యాడ్‌లో బన్నీ దోసెలు వేస్తూ ఆర్టీసీ బస్సులో ఎక్కితే నలిగిపోతాం. ర్యాపిడో బైక్ ఎక్కితే ప్రశాంతం వెళ్లొచ్చు.. అనేలా కామెంట్స్ చేశారు. దీనిపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఏండీ సజ్జనార్.. అల్లు అర్జున్‌తోపాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. తమ నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామని అన్నారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్ లలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని చురకలు అంటించారు. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదన్నారు.
సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్ లను కించపరచకూడదని వెల్లడించారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంటుందని తెలియజేశారు సజ్జనార్. అయితే సజ్జనార్ దెబ్బకు ర్యాపిడో సంస్థ దిగి వచ్చింది. యాడ్ నుండి ఆర్టీసీ బస్సు అనే పదాన్ని తొలగించింది.