మహారాష్ట్రతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సజావుగా సరఫరా అయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిపై ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హాస్పిటల్స్‌లో పడకలను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో కరోనా మూడవ, నాలుగవ వేవ్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వైద్య మౌలిక సదుపాయాలను పెంచడం వల్ల ప్రాణాంతక వైరస్‌పై సమర్ధవంతంగా పోరాడటానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా రెమ్‌డెసివిర్‌కు పెరుగుతున్న డిమాండ్‌పై గడ్కరీ మాట్లాడుతూ జెనెటెక్ లైఫ్ సైన్సెస్ వార్ధాలో ఔషధ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. రోజుకు 30,000 వయల్స్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. COVID-19 చికిత్సలో భాగంగా వైద్యులు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో కోవిడ్ బాధితులకు ఈ ఇంజెక్షన్ అత్యవసరం అవుతోంది.
నాగ్‌పూర్, విదర్భలోని ఇతర జిల్లాల్లో, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా ఇంజెక్షన్లు పంపిణీ చేస్తామని గడ్కరీ చెప్పారు. దీని వల్ల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కొరత కొంత వరకు తగ్గుతుందన్నారు.
కాగా దేశంలో గత కొద్ది రోజులుగా 3,00,000 రోజువారీ కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ కరోనా సెకండ్‌వేవ్‌తో పోరాడుతోంది. అనేక రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత నెలకొంది.
ఇక మహారాష్ట్రలో మంగళవారం 66,358 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 895 మరణాలు సంభవించాయి. వైరస్ సోకిన వారి సంఖ్య 44,10,085 కు చేరుకోగా, 66,179 మంది చనిపోయారు. 6,72,434 క్రియాశీల కేసులు ఉన్నాయి. ముంబైలో 3,999 కొత్త కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,35,483 కు చేరుకోగా, మొత్తం 12,920 మంది చనిపోయారు. మహారాష్ట్రలో రికవరీల సంఖ్య 36,69,548 కు చేరుకుంది.