Viral News : ప్రపంచ వ్యాప్తంగా అనేక చేప జాతులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని రకాల జాతులకు చెందిన చేపలను మాత్రమే తింటుంటారు. అయితే కొన్ని చేపలు బరువు ఎక్కువగా పెరగడమే కాకుండా.. అధిక ధరను పలుకుతుంటాయి. అలాంటి చేపల గురించి గతంలో మనం చదివాం. అయితే తాజాగా అలాంటిదే ఓ అత్యంత ఖరీదైన చేపను జాలర్లు విక్రయించారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పల్లిపాలెం చేపల మార్కెట్ లో తాజాగా 21 కేజీల బరువు ఉన్న కచిడి అనే జాతికి చెందిన మగ చేపను భారీ ధరకు విక్రయించారు. ఈ చేపకు వేలం నిర్వహించగా.. అత్యధిక ధర పలికింది. దీన్నే బంగారు చేప అని కూడా అంటారు.
ఇక వేలంలో ఆ చేపను ఓ వ్యక్తి ఏకంగా రూ.2.60 లక్షలకు పాడి దక్కించుకున్నాడు. అయితే నిజానికి కచిడి జాతికి చెందిన చేపల్లో ఆడ చేప కన్నా మగ చేపకే ధర, డిమాండ్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఆ మగ చేపకు అంతటి ధర పలికింది.
కచిడి చేపల పొట్ట భాగంలో ఉండే గాల్ బ్లాడర్‌ను బలానికి వాడే మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. కనుక ఈ చేపలకు అధికంగా ధర ఉంటుంది. సాధారణంగా శస్త్ర చికిత్స చేసినప్పుడు కుట్లు వేసేందుకు ఉపయోగించే దారాలను తయారు చేసేందుకు కూడా ఈ చేప గాల్ బ్లాడర్‌ను వాడుతారు. అందుకనే ఆ చేపలకు అంతటి డిమాండ్ ఉంటుంది. ఏది ఏమైనా ఆ చేప అంతటి ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.