స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటితో ప్రజలు ఎక్కువ సమయం పాటు కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు ఎక్కువగా విహరిస్తున్నారు. గంటల తరబడి చాటింగ్‌లు చేస్తున్నారు. యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీంతో అది విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. వనపర్తి జిల్లాలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా చిన్న బావి మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బొక్కలమ్మ, కురుమయ్య దంపతులకు కూతురు భువనేశ్వరి (16), కుమారులు అక్షయ కుమార్,హేమంత్ ఉన్నారు. కాగా కూతురు గత ఏడాది 10వ తరగతి పాసై ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండడం, ఎస్‌ఎంఎస్‌లు పంపడాన్ని ఆమె పెద్ద తమ్ముడు చూశాడు.
దీంతో అతను వెంటనే ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. తండ్రి ఆమెను మందలించాడు. అలా మాట్లాడడం, సందేశాలు పంపడం సరికాదని, అలాంటివి మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో భువనేశ్వరి తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలోనే ఆమె మార్గ మధ్యలో మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయానికి ఆ కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.