ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఏవిధంగా వ్యాపించి ఉందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పట్నం నుంచి ప్రతి పల్లే వరకు అధిక మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. ఇకపోతే మనదేశంలో మహారాష్ట్రలో అధిక సంఖ్యలో కేసులు నమోదు అయిన సంగతి మనకు తెలిసిందే. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రకు పక్కనే ఉన్న ఒక గ్రామంలో ఇప్పటికీ ఒక కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం.దీన్ని బట్టి చూస్తే ఆ గ్రామస్తులు ఎంత కలిసికట్టుగా ఉన్నారో అర్థమవుతోంది.
నిజామాబాద్ జిల్లా చిట్ట చివరి గ్రామం బోధన్ మండలం లోని బికినెల్లి గ్రామం. ఈ గ్రామం మహారాష్ట్రకు సరిహద్దు గ్రామం. సుమారు వెయ్యి మంది జనాభా నివసించే ఈ గ్రామంలో మహారాష్ట్రలో ఎంతో మంది బంధువులు ఉన్నారు. అయినప్పటికీ ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఎంతో ఆశ్చర్యం. అన్ని గ్రామాలలో రెవెన్యూ అధికారులు ఎంతో కష్టపడి కరోనా కట్టడి చేస్తున్నప్పటికీ వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ గ్రామంలో మాత్రం మొదటి దశలో కానీ, రెండవ దశలో కానీ ఒక కేసు నమోదుకాకపోవడంతో ఈ గ్రామాన్ని కరోనా ఫ్రీ విలేజ్ గా గుర్తించారు.
ఈ గ్రామస్తులందరూ గ్రామ సర్పంచ్ నాగ కళ పిరాజి ఆధ్వర్యంలో పటిష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆ దేశాలను పరిగణలోకి తీసుకొని బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ కరోనాని తమ దరిచేరనీయని గ్రామంగా బిక్కినెల్లి గ్రామం నిలుస్తోంది. ఈ గ్రామం నుంచి అత్యవసర పరిస్థితులు మినహా ఎవరు బయటికి వెళ్లరు. అదే విధంగా ఇతర గ్రామస్తులను ఎవరిని వీరి గ్రామంలోకి అనుమతించరు. ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తలను పాటిస్తూ పరిశుభ్రంగా ఉండటం వల్లే ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలియజేస్తున్నారు.