భారత మాజీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండుల్కర్ కరోనా బారిన పడ్డాడు. ఈ మేరకు సచిన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ట్విట్టర్ ద్వారా సచిన్ ఈ విషయాన్ని తెలియజేశాడు. తనకు కోవిడ్ 19 స్వల్ప లక్షణాలు కనిపించాయని, దీంతో వెంటనే అప్రమత్తమై పరీక్ష చేయించుకున్నానని, అందులో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపాడు.
కాగా తాను ఇంట్లో క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని సచిన్ తెలిపాడు. అయితే కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారని, కానీ కోవిడ్ నెగెటివ్ వచ్చిందన్నాడు. అయినప్పటికీ తన చుట్టూ తిరిగిన వారు, ఉన్నవారు క్వారంటైన్‌లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. ఇక తనకు మద్దతు ఇస్తున్న ఫ్యాన్స్ తోపాటు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు.
— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2021
కాగా సచిన్ భారత క్రికెట్ జట్టుకు 1989 నుంచి 2013 వరకు ఆడాడు. మొత్తం 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్ సచిన్ కావడం విశేషం. అలాగే వన్డేలు, టెస్టుల్లోనూ అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ పేరిటే ఉంది. టెస్టుల్లో సచిన్ 15,291 పరుగులు చేయగా, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సిరీస్‌లో సచిన్ ఇండియా లెజెండ్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో భారత్ ఫైనల్ లో శ్రీలంక లెజెండ్స్‌పై విజయం సాధించింది.